ఒక ముస్లిం సహోదరుడు విసరిన ప్రశ్న
ఒక విషయాన్ని సూటిగా అడుగుతాను నిజమైన సమాధానం చెప్పు. నీవు నిజ క్రైస్తవుడివా? ఒకవేళ ఐనట్లైతే పాతనిబంధన, కొత్త నిబంధన అంటే ఏమిటో వివరణనిచ్చి, పాతనిబంధనలో యేసుక్రీస్తును ''దైవకుమారుడు" అని సంబోధించడం జరిగిందా లేక మనుష్యకుమారుడు అని సంబోధించడం జరిగిందా అని ''ప్రభుతేజ" తెలుగు రచయితవైన నీవు సమాధానము చెప్పిన తర్వాత నీ ఇష్టమైనట్లు దైవధిక్కరణ మఱియు ప్రవక్తల ధిక్కరణ చేసుకో. ఆ పాపఫలం నీవు మఱియు నీకు సహకరించిన వారికి తగులుతుంది. ఇంతకంటే ఎక్కువగా నేనేమి సమాధానము యివ్వవలసిన అవసరం లేదనుకుంటున్నాను. నీ సమాధానమును నీ యొక్క నీఛస్వభావాన్నిఇన్షా అల్లాహ్ (దైవ అనుగ్రహంతో) బయటపెట్టుటకు ప్రయత్నిస్తాను.
దమ్ముంటే ఈ ప్రశ్న మఱియు దీని సమాధానము నీ ఈ యొక్క వెబ్‍సైట్‍లో పెట్టు చూసుకుందాం .....!
ఇట్లు,
ముస్లిమ్ (నిజ దైవదాసుడు).
మా జవాబు
ప్రియమైన ముస్లిం సహోదరునికి ప్రేమతో వ్రాయునదేమనగా, ఈ వెబ్‍సైట్ ప్రభుతేజ సొంతము కాదు, దీనిని నడిపేదీ ఆయన కాదు. అందుకే మీరు విసరిన విసుర్లకు బదులివ్వవలసినదిగా మీ ఈ-మెయిల్‍ను మా ప్రియ సహోదరుడైన ప్రభుతేజకు పంపించాము. ఆయన మీ ఈ-మెయిల్‍కి ఇచ్చిన జవాబును మీ కోరికపైనే మా వెబ్‍సైట్‍లో ప్రచురిస్తున్నాము. చదువగలరు.
సహోదరుడు ప్రభుతేజ ఇచ్చిన జవాబు
ప్రియ ముస్లిం సహోదరుడా,
నేను నిజమైన క్రైస్తవుడినే అని నిరూపించుకోవలసిన అవసరం నాకు లేదు, దాని వల్ల మీకు ఒరిగే లాభం కూడా ఏమీ లేదు.
ఇలాగే ఒకసారి ముహమ్మద్‍గారు ముబాహలా అనే పందెంలో కొంతమంది క్రైస్తవులతో పందెం కాసి, యేసుక్రీస్తువారి దైవత్వం గురించి వారి పరస్పర వాదనలు ముగిసిన అనంతరం, వారిలో ఏ పక్షంవారు అబద్ధమాడుతున్నారో వారి కుటుంబం నాశనమయ్యేటట్లుగా తమ పిల్లలపై మరియు కుటుంబముపై ఒట్టు పెట్టుకుని ఒకరినొకరు శపించుకోవాలని చెప్పారు (సురా 3:61). క్రైస్తవులమైన మాకు ఇలాంటి అనవసరమైన శాపనార్థాలతో కూడిన పందెములు అవసరం లేదు. మా దేవుడు మాకు నేర్పిన తర్కం అది కాదు. కనుకనే అప్పటి క్రైస్తవులు కూడా ఆ శాపభూయిష్టమైన పందెంలో పాల్గొనలేదు. కానీ ముహమ్మద్‍గారు ఆ ఆహ్వానం ఇస్తూ ఆ పందెంలో పాల్గొన్న ఒకే ఒక్క సంవత్సరానికి ఏం జరిగిందో తెలుసా? ముహమ్మద్‍గారు మరియు ఆయన కుటుంబం సర్వనాశనమైన సత్యం ఇస్లామీ చరిత్ర మనకు చెప్తోంది. (10AH లో ముబాహలా జరిగినట్టు మరియు 11 AH లో ముహమ్మద్‍గారి మరణం జరిగినట్టు www.itsislam.net/articles/life_of_Prophet_Muhammad.asp లో చూడగలము). కాబట్టి సత్యమువైపు లేకుండా నోటికొచ్చినట్టు పందాలు పెట్టకుంటే మంచిది కాదు, దాని ఫలితం ఇలాగే ప్రాణాంతకంగా ఉంటుంది.
క్రీస్తును మా స్వంత రక్షకునిగా అంగీకరించిన మేము క్రీస్తు చెప్పిన ఉపదేశాలను ధిక్కరించకుండా ఉంటాము. ఆయన ధృవపరచిన గ్రంథాన్నీ ఆ గ్రంథంలోని ప్రవక్తల ఉపదేశసారాంశాన్నీ ధిక్కరించకుండా ఉంటాము. ఎందుకంటే బైబిల్‍లోని దేవుడు, ఆయన పంపిన ప్రవక్తలు, అందరూ యేసువైపే మమ్మును మరల్చుతున్నారు. కనుక, బైబిల్ గ్రంథంలోని దేవునికి సరిసమానుడు కానివాడు మాకు దేవుడూ కాడు, ఆ పరిశుద్ధగ్రంథ విలువలను కూడా అర్థం చేసుకోలేని వ్యక్తులను మేము ప్రవక్తలగా గుర్తించనూలేము.
మీరు మీ మతంపై ఉన్న రోషంతో అయినా సరే ఒక్కమాట సరిగ్గా చెప్పారు. అదేమిటంటే, నేను నీఛమైన స్వభావము కలవాడినని. అది నాతోపాటు ప్రతిఒక్క మానవునికి వర్తించే మాటే. మనమందరము నీఛులము; కనుకనే మన స్వనీతి దేవుని నీతితో పోలిస్తే మురికి గుడ్డలుగా ఉంటుంది. అందుకే క్రీస్తు మన కొరకు సిలువలో మరణించి తిరిగిలేచి నిన్ను నన్ను రక్షించ సమర్థత తనకున్నదని దేవుని ఎదుట నిరూపించుకున్నారు. ఆయనను నమ్మి విశ్వసిస్తే నీవు కూడా దేవుని కుమారుడివవుతావు.
ఇక మీ ప్రశ్న: పాతనిబంధన అంటే ఏమిటి? క్రొత్త నిబంధన అంటే ఏమిటి? పాత నిబంధనలో యేసు మనుష్య కుమారుడు అని సంబోధించబడ్డారా? లేక దేవుని కుమారుడు అని సంబోధించబడ్డారా?
జవాబు : దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అందజేసి, దాని ఆధారముగా వారిని ఆశీర్వదించాడు. అలాగే విభిన్న ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయుల జీవితంలో తన ఉనికిని చాటుతూ ధర్మశాస్త్రబద్ధముగా వారిని జీవించేలా చేశాడు. క్రొత్త నిబంధన అనగా ఏమిటంటే, ఛాయవంటి పాత నిబంధనకు అందలి ధర్మశాస్త్రమునకు నిజమైన అర్థం (నెరవేర్పు) ప్రభువైన యేసుక్రీస్తులో నేరవేరుతున్నది కాబట్టి, ఆయన పై విశ్వాసముంచుట ద్వారా దేవుని పిల్లలుగా అవటం.
ఇక మనుష్యకుమారుని విషయమై మాట్లాడితే, దానియేలు 7:13-14, 18, 22, 27, జకర్యా 9:9-11, 14-16 చదివి చూడాలి. అక్కడ మనుష్యకుమారుడు మేఘారూఢుడై వస్తున్నట్టు, ఆయన రాజ్యము సర్వకాలము ఉంటుందని, ఆయన యెహోవా దేవునికి కలిగిన లక్షణములు కలిగి ఉన్నారని మనము చూస్తాం. కనుకనే మత్తయి 16:27-28, 19:28, 25:31-34, అలాగే మార్కు 13:26-27, 14:60-64 లో యేసుప్రభువు తనను తాను మనుష్యకుమారుడు అని సంబోధించుకున్నప్పుడు, అలాగే దేవుని కుమారుడు అని పలుచోట్ల సంబోధించినప్పుడు, త్రిత్వములోని ఒక వ్యక్తిని గూర్చి, తన దైవత్వమును గూర్చి మాట్లాడుతున్నారు అనేది బైబిల్ చెప్పే సత్యం. ఆ మనుష్యకుమారునికి పాపములను క్షమించే అధికారం ఉంది (మార్కు 2:10), మరణముపై అధికారం ఉంది (మార్కు 8:31), సబ్బాతు దినముకు సైతం ఆయన ప్రభువని (మత్తయి 8:12), దేవునికి మాత్రమే చెల్లిన లక్షణములను మనుష్యకుమారునికి బైబిల్ గ్రంథం ఆపాదిస్తుంది. కనుక పాతనిబంధనలో మనుష్యకుమారుడు అని వ్రాసినంత మాత్రాన తమరు రుజువు చేసేది ఏమీ ఉండదు.
చూసుకుందాం! అని ప్రగల్భాలు పలికి ప్రజలను బెదిరించి వారి నోరు నొక్కేయటం కొంతమంది ముస్లిం ప్రచారకులకు మరియు ముస్లిం తీవ్రవాదులకు అలవాటేనని మాకు తెలుసు. కాబట్టి మీ బెదిరింపు మాటలు మాకు తప్ప మరింకెవరికైనా చెప్పవచ్చు. మీ దగ్గర ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి దానికి ధీటైన సమాధానం యేసుక్రీస్తువారి అనుగ్రహం చొప్పున తప్పక చెప్పే ప్రయత్నం చేస్తాం.
ఇట్లు,
ప్రభుతేజ (తెలుగు రచయిత)